24/08/2019
బ్రిటన్ రండి బాబూ..!
పెద్ద చదువులకు చేయూతనిస్తాం
మాస్టర్స్ డిగ్రీ చేసే వారికి 30 వేల పౌండ్ల ఉపకారవేతనం
దరఖాస్తులకు తుది గడువు నవంబరు 5
తెలుగు రాష్ట్రాల నుంచి స్పందన కరవు
బ్రిటిష్ పారిశ్రామికవేత్తల చూపు హైదరాబాద్ వైపు
ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిశ్రమల ఏర్పాటు
‘ఈనాడు’తో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్
ఈనాడు - హైదరాబాద్
బ్రిటన్ రండి బాబూ..!
యువత ఎంచుకున్న రంగాల్లో అంతర్జాతీయంగా అవగాహన పొందటం ద్వారా మెరుగ్గా రాణించేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ తెలిపారు. వారికి నచ్చిన కోర్సులో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు స్కాలర్‌షిప్స్, వృత్తి నిపుణులకు ఫెలోషిప్స్ అందిస్తున్నట్టు వివరించారు. ‘2020-21 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులు, వృత్తి నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ఎక్కువ మంది ఎంపికయ్యే అవకాశం ఉన్నా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించటం లేదు’ అని హైదరాబాద్‌లోని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ చెప్పారు. శుక్రవారం ఆయన ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ స్కాలర్‌షిప్స్ పొందడం ఎలా?
పట్టభద్రులై, రెండేళ్లపాటు ఉద్యోగ అనుభవం ఉన్నవారు స్కాలర్‌షిప్స్‌పై మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అర్హులు. వృత్తి నిపుణులు ఆయా రంగాల్లో మరింతగా రాణించేందుకు స్వల్పకాలిక కోర్సుల కోసం ఫెలోషిప్స్ ఇస్తున్నాం. భవిష్యత్తు నాయకులను తయారు చేయాలన్నదే లక్ష్యం. 1983 నుంచి ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం. ప్రతి సంవత్సరం సుమారు 1,800 మందికి స్కాలర్‌షిప్స్ ఇస్తున్నాం. భారతీయ విద్యార్థుల కోసం 110 కేటాయించాం. సమగ్ర సమాచారం కోసం www.chevening.org లేదా www. chevening.org/india. www. chevening.org/scholarships పరిశీలించవచ్చు.
ఏ రాష్ట్రాల నుంచి ఎంపిక ఎక్కువగా ఉంది?
బెంగళూరు, దిల్లీ, కోల్‌కత, ముంబయి నగరాల నుంచి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎంపికవుతున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు అవకాశాలు అధికంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో చదివే వారు, ప్రముఖ సంస్థల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాలు పొందేవారు ఇక్కడి నుంచి ఎక్కువ మంది ఉంటున్నారు. దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మాత్రం నామమాత్రంగానే ఉంది. ఈ స్కాలర్‌షిప్స్, ఫెలోషిప్స్‌పై ఇటు విద్యార్థులకు అటు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవటమే కారణం.
దరఖాస్తు గడువు ఎప్పటి వరకు ఉంది? ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు?
బ్రిటన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకునే వారందరూ స్కాలర్‌షిప్స్ పొందేందుకు అర్హులు. వివిధ దశల ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. మాస్టర్స్ పూర్తి చేసే ఏడాది కాలానికి అన్ని ఖర్చులను బ్రిటిష్ ప్రభుత్వమే భరిస్తుంది. ఫీజు, నివాస ఖర్చులు ఇందులో ఉంటాయి. ఒక్కో విద్యార్థిపై ఏడాది కాలానికి 30 వేల పౌండ్లను వెచ్చిస్తాం. భారతీయ కరెన్సీ ప్రకారం రూ.26 లక్షలకు పైగా ఉంటుంది. 12 వేల రకాల మాస్టర్స్ కోర్సుల్లో ఎందులోనైనా వారు చేరవచ్చు. ఇన్నోవేషన్స్, సైబర్ సెక్యూరిటీ నుంచి ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ, లైఫ్ సైన్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలా చాలా కోర్సులున్నాయి. కోర్సు ఎంపిక స్వేచ్ఛ విద్యార్థులదే. బ్రిటన్‌లోని 150 విశ్వవిద్యాలయాల్లో ఎక్కడైనా చేరవచ్చు. ఈ ఏడాది నవంబరు అయిదో తేదీతో దరఖాస్తు చేసుకునే గడువు ముగుస్తుంది. ఫిబ్రవరిలోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తాం. ఫెలోషిప్స్ గడువు ఒక వారం నుంచి మూడు నెలల వరకు ఉంటుంది.
భారత్‌తో వాణిజ్య సంబంధాలు ఎలా ఉన్నాయి?
బాగున్నాయి. భారీగానే ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. తమ దేశానికి చెందిన కంపెనీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 ఉన్నాయి. రానున్న రోజుల్లో ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. భారతదేశంలో కంపెనీలు పెట్టాలంటే బ్రిటిష్ పారిశ్రామికవేత్తలు బెంగళూరు, ముంబయి, దిల్లీలవైపే ఆసక్తి చూపేవారు. ప్రస్తుతం హైదరాబాద్‌వైపు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిశ్రమలు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎక్కువ మందిని భాగస్వాములను చేసేందుకు మీ ప్రణాళిక ఏమిటి?
పత్రికలు, సామాజిక మాధ్యమాలే ఆధారం. వాటి ద్వారా ఎక్కువ మంది తల్లిదండ్రులు, విద్యార్థులను చేరేందుకు ప్రయత్నిస్తున్నాం. దరఖాస్తుదారులకు ఉపకరించేలా ఆన్‌లైన్‌లో ప్రశ్న-జవాబు విధానం అమలుచేయనున్నాం. గతంలో లబ్ధి పొందిన వారి ద్వారా సమావేశాలు నిర్వహిస్తాం. స్కాలర్‌షిప్పులకు కోల్‌కత, బెంగళూరు, ముంబయి, దిల్లీలలో ఇంటర్వ్యూలు చేస్తాం. ఫెలోషిప్స్‌కు మాత్రం దిల్లీలోనే నిర్వహిస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చెప్పుకోదగిన సంఖ్యలో దరఖాస్తులు వస్తే హైదరాబాద్‌లో కూడా ఇంటర్వ్యూలకు ప్రణాళిక రూపొందిస్తాం.
Since 1983, Chevening has brought over 50,000 exceptional professionals from around the world to study in the UK through scholarships and fellowships funded by the UK government. This unique opportunity has helped to elevate careers, transform communities, shift and deepen perspectives, and build in...